Air Purifier: మీ ఇంటికి తగిన ఎయిర్ ప్యూరిఫైయర్ కోసం చూస్తుంటే .. ఈ 7 విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి.!

Highlights

దేశంలోని అనేక నగరాల్లో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది

కేవలం బయట మాత్రమే కాదు ఇంట్లో కూడా రక్షణ కరువవుతోంది

ఇంట్లో ఉండే గాలిని శుభ్రంగా ఉంచుకోవడానికి ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగపడుతుంది

Air Purifier: దేశంలోని అనేక నగరాల్లో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. కేవలం బయట మాత్రమే కాదు ఇంట్లో కూడా మీకు రక్షణ కరువవుతుంది. ఇంట్లో దుమ్ము, పొగ మరియు పెంపుడు జంతువుల నుంచి వచ్చే అలర్జీ కారకాలతో పాటు ఇతర సూక్ష్మ కణాలు కూడా గాలిలో ఉండే అవకాశం ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉండే గాలిని శుభ్రంగా ఉంచుకోవడానికి ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగపడుతుంది. అయితే, మార్కెట్లో వందల రకాల మోడల్స్, విభిన్న ధరలు మరియు రకరకాల ఫీచర్లతో ఎయిర్ ప్యూరిఫైయర్స్ అందుబాటులో ఉన్నాయి. అందుకే, ఎయిర్ ప్యూరిఫైయర్ కొనేముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది.

Air Purifier:

ఒక మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ కొనడానికి మీరు ఒక 7 విషయాలు పరిశీలనలోకి తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఎయిర్ ప్యూరిఫైయర్ చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా కూడా ఇందులో కొన్ని ముఖ్యమైన భాగాలు మరియు పని చేయడానికి అవసరమైన విషయాలు ఉంటాయి. వాటిలో CADR రేటింగ్‌, HEPA ఫిల్టర్ మరియు విద్యుత్ వినియోగం వంటి ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఆ 7 విషయాల గురించి వివరంగా చూద్దాం.

గది పరిమాణానికి సరిపోయే మోడల్ ఎంచుకోండి

ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాలనుకున్నప్పుడు ముందుగా మీరు గుర్తుంచుకోవలసిన మొదటి విషయం గది పరిమాణం. ప్రతి ఎయిర్ ప్యూరిఫైయర్ అన్ని గదులకు సరిపోదు. చిన్న బెడ్‌ రూమ్ కోసం రూపొందించిన మోడల్‌ ను పెద్ద హాల్‌లో ఉపయోగిస్తే ఆశించిన ఫలితం రాకపోవచ్చు. అందుకే, కొనేముందు గది విస్తీర్ణాన్ని చదరపు అడుగుల్లో లెక్కించాలి. ఈ కొలతలతో ప్యూరిఫైయర్ కవర్ చేయగలిగే గది విస్తీర్ణం మరియు CADR (Clean Air Delivery Rate) వివరాలను పోల్చాలి. CADR ఎక్కువగా ఉంటే సాధారణంగా గాలిని వేగంగా శుభ్రం చేయగల సామర్థ్యం ఉన్నట్లు అర్థం.

CADR రేటింగ్‌ ను పరిశీలించండి

ఎయిర్ ప్యూరిఫైయర్ పనితీరును అంచనా వేయడంలో CADR ఒక ముఖ్యమైన ప్రమాణం. ఇది ఒక నిర్దిష్ట సమయంలో ప్యూరిఫైయర్ ఎంత పరిమాణంలో శుభ్రమైన గాలిని అందించగలదు అని తెలియజేస్తుంది. అందుకే, మీరు ఎయిర్ ప్యూరిఫైయర్ ని ఉంచడానికి కోరుకునే గది పరిమాణానికి తగిన CADR ఉన్న మోడల్‌ ను ఎంచుకోవాలి. కేవలం తక్కువ ధర లేదా ఆకర్షణీయమైన డిజైన్ చూసి మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోకూడదు.

HEPA ఫిల్టర్ ఉందో లేదో చూడండి

ఎయిర్ ప్యూరిఫైయర్ కొనేటప్పుడు ముందుగా దానిలో ఉన్న ఫిల్టర్ టెక్నాలజీని పరిశీలించాలి. ముఖ్యంగా, True HEPA లేదా H13 HEPA ఫిల్టర్ ఉన్న మోడళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. సరైన పరిస్థితుల్లో పనిచేసే HEPA ఫిల్టర్ గాలిలోని 0.3 మైక్రాన్ పరిమాణం కలిగిన కణాల్లో గరిష్టంగా 99.97 శాతం వరకు తొలగించగలదు. ఇవి దుమ్ము, పుప్పొడి, కొన్ని అలర్జీ కారక కణాలు తగ్గించడంలో సహాయ పడతాయి. కేవలం HEPA అని రాసి ఉన్నంత మాత్రాన సరిపోదు, ఆ ఫిల్టర్‌ కు సంబంధించిన ధృవీకరణ వివరాలను కూడా మీరు పరిశీలించాలి.

ఫిల్టర్ మార్చే ఖర్చు తెలుసుకోండి

ఎయిర్ ప్యూరిఫైయర్ కొనుగోలు చేసే సమయంలో కేవలం ధర మాత్రమే కాకుండా ఫిల్టర్ రీప్లేస్‌మెంట్ ఖర్చును కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే, కొన్ని మోడళ్లలో ఫిల్టర్లు ఎక్కువ కాలం పని చేస్తే, మరికొన్నింటిలో ఫిల్టర్లు తరచుగా మార్చాల్సి రావచ్చు. సాధారణంగా ఎయిర్ ప్యూరిఫైయర్ లో ఫిల్టర్ యొక్క జీవితకాలం అనేది ఎయిర్ ప్యూరిఫైయర్ వినియోగం, కాలుష్య స్థాయి, తయారీదారు సూచనలపై ఆధారపడి ఉంటుంది. అందుకే, కొత్త ఫిల్టర్ ధర మరియు అందుబాటులో ఉండే విధానం కూడా ముందుగా తెలుసుకోవడం మంచిది.

సౌండ్ అండ్ విద్యుత్ వినియోగం

మీ బెడ్‌ రూమ్‌ లో ఉపయోగించడానికి ఎయిర్ ప్యూరిఫైయర్ కొనుగోలు చేయాలనుకుంటే, తక్కువ శబ్దంతో పనిచేసే మోడల్‌ ను మీరు ఎంచుకోవాలి. ముఖ్యంగా ఆ ఎయిర్ ప్యూరిఫైయర్ లో నైట్ మోడ్ అండ్ స్లీప్ మోడ్ ఉన్నాయో చూడాలి. అలాగే, విద్యుత్ వినియోగం ఎంత ఉంటుందో కూడా మీరు పరిశీలించాలి. ఎయిర్ ప్యూరిఫైయర్ ను రోజంతా ఉపయోగించే వారికి తక్కువ విద్యుత్ వినియోగం కలిగిన మోడల్ ప్రయోజనకరంగా ఉంటుంది.

స్మార్ట్ ఫీచర్లు అవసరమా?

ప్రస్తుతం అనేక ఎయిర్ ప్యూరిఫైయర్ లలో PM2.5 సెన్సార్, ఆటో మోడ్, ఎయిర్ క్వాలిటీ ఇండికేటర్ మరియు మొబైల్ యాప్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గాలిలో కాలుష్య స్థాయిని బట్టి ఫ్యాన్ స్పీడ్‌ ను ఆటోమేటిక్‌ గా మార్చే మోడళ్లు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. అయితే, అవసరం లేని ఫీచర్ల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని మీరు గుర్తుపెట్టుకోండి.

వారంటీ అండ్ సర్వీస్ వివరాలు క్లియర్ గా తెలుసుకోండి

ఒక ఎయిర్ ప్యూరిఫైయర్‌ ను కొనుగోలు చేసేటప్పుడు కంపెనీ వారంటీ, సర్వీస్ సెంటర్ మరియు ఫిల్టర్ల లభ్యత వంటి అంశాలను కూడా పరిశీలించాలి. ముఖ్యంగా మీ ప్రాంతంలో ఫిల్టర్లు సులభంగా దొరుకుతాయో లేదో తెలుసుకోవాలి. UV-C లేదా అయనైజర్ వంటి అదనపు టెక్నాలజీ ఉన్న మోడళ్లను ఎంచుకుంటే వాటి భద్రత మరియు ఓజోన్ విడుదలకు సంబంధించిన వివరాలను కూడా తనిఖీ చేయాలి.

ఒక మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ ఎంచుకోవడం అంటే దాని అర్ధం ఖరీదైన మోడల్ అని కాదు. మీ గది పరిమాణానికి సరిపోయే CADR, నాణ్యమైన HEPA ఫిల్టర్, తక్కువ నిర్వహణ ఖర్చు మరియు అవసరమైన స్మార్ట్ ఫీచర్లు వంటి వివరాలు ఉన్న మోడల్‌ ను పరిగణలోకి తీసుకొని ఎంచుకోవాలి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile