PIB fact check report on whatsapp viral message of PMJDY 2026 scheme 2 lakh benefit
ప్రస్తుతం ఒక వైరల్ మెసేజ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, ముఖ్యంగా వాట్సాప్ లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ మెసేజ్ పెద్దగా ఉన్నా “PMJDY 2026 స్కీమ్ తో 2 లక్షలు సింపుల్ గా పొందండి” అనే సారాంశం తో ఉంటుంది. ఈ మెసేజ్ WhatsApp లో చాలా వేగంగా షేర్ అవుతున్నట్లు గుర్తించారు. వాట్సాప్ యూజర్లు మరియు ప్రజలు ఈ మెసేజ్ గురించి నిజానిజాలు తెలుసుకునేలా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ ప్రజల ప్రయోజనార్ధం నివేదిక అందించింది. ఈ వాట్సాప్ వైరల్ మెసేజ్ గురించి చెబుతున్న నిజాలు ఏమిటో తెలుసుకోండి.
వాట్సప్ లో ఒక మెసేజ్ ఇప్పుడు శరవేగంగా షేర్ అవుతూ బాగా వైరల్ అయ్యింది. ఈ మెసేజ్ లో “ప్రధాన మంత్రి జనధన్ యోజన (PMJDY) 2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి మరియు 13 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయులు వయస్సు ఆధారంగా రూ.50,000 నుంచి రూ.2,00,000 వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు” అని వ్రాసి ఉంది.
మన దేశంలో అసలే పథకాలు ఎక్కువ మరియు ఉచిత పథకాలకు అలవాటు పడిన చాలా మంది ఈ మెసేజ్ ను నిజమే అని నమ్మే అవకాశం ఉంది. అందుకే, దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ స్పందిస్తూ ఈ ప్రచారం పూర్తిగా అవాస్తమని స్పష్టం చేసింది.
PIB వెల్లడించిన వివరాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం జనధన్ యోజన కింద వయస్సు ఆధారంగా రూ.50,000 నుంచి రూ. 2,00,000 వరకు నగదు సాయం అందించే ఎలాంటి కొత్త పథకాన్ని ప్రకటించలేదని తేల్చి చెప్పింది. ఈ వైరల్ సందేశంలో పేర్కొన్న ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కూడా అధికారికం కాదని తెలిపింది. ఇలాంటి సందేశాలను నమ్మి అందులో ఉన్న అనుమానాస్పద వెబ్‌సైట్ లు లేదా లింక్ లలో వ్యక్తిగత వివరాలు లేదా బ్యాంకు సమాచారం లేదా ఆధార్ వివరాలు నమోదు చేయొద్దని ప్రజలని హెచ్చరించింది.
Also Read: Realme C100x: బిగ్ బ్యాటరీ 4G ఫోన్ కోరుకునే వారి కోసం కొత్త ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ.!
ప్రధాన మంత్రి జనధన్ యోజన పథకం అనేది దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఆర్థిక చేరిక (Financial Inclusion) కార్యక్రమం. ఈ పథకం ద్వారా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా, రూపే డెబిట్ కార్డు, అర్హత ఆధారంగా ప్రమాద బీమా కవరేజ్ మరియు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) సౌకర్యం వంటి సేవలు అందిస్తుంది. అలాగే కొన్ని నిబంధనల మేరకు ఓవర్ డ్రాఫ్ట్ వంటి బ్యాంకింగ్ ప్రయోజనాలు కూడా యూజర్లకు అందుబాటులో ఉంటాయి.
అయితే, వాట్సాప్ లో షేర్ అవుతున్న వైరల్ మెసేజ్ లో చెప్పినట్లు పథకం ద్వారా అర్హులకు నేరుగా 50 వేల నుంచి 2 లక్షల వరకు నగదు సాయం అందించే రూల్ అసలు లేనే లేదు. ఇది పూర్తిగా అవాస్తవం మరియు ప్రజలను మోసం చేయడానికి స్కామర్లు విసిరిన వల మాత్రమే అని ప్రజలు గుర్తించాలి.
ప్రభుత్వ పథకాల గురించి సమాచారం తెలుసుకోవాలంటే అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లు లేదా PIB Fact Check వంటి విశ్వసనీయ సోర్స్ లు మాత్రమే ఆధారంగా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.