exclusive nothing to exit 12 markets globally as global shipments decline
Exclusive: మార్కెట్ మందగించడంతో ప్రపంచవ్యాప్తంగా 12 మార్కెట్ల నుంచి వైదొలగే ఆలోచనలో Nothing ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి, 2026 రెండో త్రైమాసికం (Q2 2026) లో భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో నథింగ్ 105 శాతం వృద్ధి రేటును సాధించినట్లు మార్కెట్ పరిశోధనా సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. అయితే, అంతర్జాతీయ స్థాయిలో కొన్ని మార్కెట్ లలో కార్యకలాపాలను తగ్గించడం మరియు ఉద్యోగుల సంఖ్యను కుదించడం ద్వారా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు కాస్ట్ కటింగ్ చర్యలు చేపట్టడం వంటి వాటిని సంస్థ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
నథింగ్ ఫోన్ (4a) సిరీస్ కు ఇండియాలో లభించిన మంచి స్పందన తో పాటు, IPL 2026 సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించడం కూడా ఇండియాలో నథింగ్ అధిక వృద్ధి సాధించడంలో కీలక పాత్ర పోషించాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, గ్లోబల్ మార్కెట్ లో కథ మరోలా ఉందని నివేదికలు చెబుతున్నాయి.
విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం, నథింగ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను గణనీయంగా కుదించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 12 కు పైగా దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం.
ఈ లిస్ట్ లో మధ్యప్రాచ్య దేశాలతో పాటు జపాన్ మరియు యూరప్ లోని కొన్ని దేశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చర్య ద్వారా వ్యాపార వ్యయాన్ని తగ్గించడం మరియు లాభదాయకమైన మార్కెట్లపై దృష్టి కేంద్రీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదే దారిలో సంస్థ లో ఉన్న ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా తగ్గించే చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఉద్యోగుల్లో సుమారు 40 శాతం మందిని తగ్గించే ప్రణాళిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
నథింగ్ పరిశోధన మరియు అభివృద్ధి (R&D) విభాగం ప్రస్తుతం చైనా మరియు లండన్ కేంద్రంగా సుమారు 70:30 నిష్పత్తిలో నిర్వహించబడుతోంది. అయితే, ఈ విభాగంలో కూడా ఉద్యోగాల కోత తప్పదని సమాచారం. చైనా కేంద్రంలో దాదాపు 50 శాతం, లండన్ కార్యాలయంలో 30 నుంచి 40 శాతం వరకు ఉద్యోగులను తగ్గించే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది.
అయితే, ఈ అంశాలపై నథింగ్ సంస్థ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ సమాచారం నిజమా కాదా అన్నదానిపై కంపెనీ స్పందన కోసం ఇండస్ట్రీ మరియు మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
గ్లోబల్ మార్కెట్ తో పోలిస్తే ఇండియాలో నథింగ్ మార్కెట్ భిన్నంగా ఉంది. ఇందులో మంచి వృద్ధి రేటుతో కంపెనీ దూసుకుపోతోంది. అలాగే, ఇండియాలో ఉన్న లాయల్ యూజర్ బేస్, RCB అసోసియేషన్ మరియు హార్డ్ వేర్ డిజైన్ కారణంగా ఇండియాలో మంచి స్పందన అందుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, భారత మార్కెట్లో లభిస్తున్న సానుకూల స్పందన నథింగ్ కు బలంగా నిలుస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని కుదిస్తున్న ఈ సమయంలో అదే వృద్ధి కంపెనీ ని నిలబెట్టగలదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
నెట్టింట్లో వస్తున్న నివేదికల పై స్పందన కోసం ‘డిజిట్’ (Digit) సంస్థ ‘నథింగ్’ ను సంప్రదించింది. కంపెనీ రెస్పాన్స్ వచ్చిన తర్వాత లేటెస్ట్ అప్‌డేట్ మీకు అందిస్తాము.