SBI Data Leak thousands of users data seen
SBI Data Leak: భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ల వ్యక్తిగత సమాచారం ఇప్పుడు డార్క్ వెబ్ లో కనిపించిందన్న వార్త ప్రస్తుతం ఖాతాదారులకు ఆందోళన కలిగిస్తోంది. 2026 అక్టోబర్ 21న వెలువడిన నివేదికల ప్రకారం, డార్క్ వెబ్ లో లభించిన సుమారు 3,75,000 రికార్డులను ప్రాథమికంగా పరిశీలించగా, వాటిలో ఏకంగా 3,897 రికార్డుల్లో పర్సనల్ డేటాని వెల్లడించే కస్టమర్ సమాచారం ఉన్నట్లు SBI గుర్తించింది. ఈ విషయం గురించి అక్టోబర్ 16న థ్రెట్ ఇంటెలిజెన్స్ సేవల సంస్థ, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ మరియు భారత ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ CERT-In నుంచి ఈ విషయంపై హెచ్చరికలు అందినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
డార్క్ వెబ్ లో బయటపడినట్లు గుర్తించిన సమాచారంలో కస్టమర్ల పేర్లు, జెండర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, ఈమెయిల్ చిరునామా, నివాస చిరునామా, బ్రాంచ్ వివరాలు, కస్టమర్ ఐడెంటిఫికేషన్ ఫైల్ (CIF) నంబర్, రుణాలు లేదా లీడ్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే, 3.75 లక్షల రికార్డులన్నీ SBI కస్టమర్లవేనా లేదా ఇవన్నీ పూర్తిగా నిజమైన సంఖ్య అవునా కాదా అని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. ఈ ఘటనకు కారణం ఏమిటి మరియు ఈ సమాచారం ఎక్కడి నుంచి బయటకు వచ్చింది అని దీనిపై విచారణ కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు, యూజర్ల పై దాని ప్రభావం ఎంతవరకు ఉంది అనే అంశాల పైన కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
ముఖ్యంగా, వ్యక్తిగత సమాచారం బయటపడిందని చెప్పడం మాత్రమే జరిగింది. ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు కూడా చోరీకి గురైనట్లు ఎక్కడా చెప్పలేదు. ఈ వివరాలను SBI వెల్లడించిన సమాచారం మరియు వార్తా నివేదిక ఆధారంగా అందించాము.
Also Read: అమెజాన్ GIF Sale నుంచి అతి చవక రేటుకే Smart Glasses సేల్ చేస్తోంది .. డోంట్ మిస్.!
ఈ ఘటన నేపథ్యంలో SBI ఖాతాదారులు తమ డిజిటల్ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే, మీ వ్యక్తిగత వివరాలు తెలిసిన మోసగాళ్లు బ్యాంకు అధికారులు లేదా KYC విభాగ సిబ్బంది అంటూ మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది.
అంతేకాదు, లోన్ సంస్థ ప్రతినిధులుగా నటిస్తూ ఫోన్ కాల్స్, SMS లు, WhatsApp సందేశాల సెండ్ చేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల OTP, ATM PIN, CVV, UPI PIN, నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ లను ఎవరితోనూ పంచుకోకూడదు. అనుమానాస్పద లింకులను తెరవడం, తెలియని యాప్ లను ఇన్ స్టాల్ చేయడం మరియు ఫోన్ లో చెప్పిన సూచనల ప్రకారం స్క్రీన్ షేరింగ్ చేయడం వంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు.
మీ బ్యాంకు లావాదేవీలపై నిత్యం నిఘా ఉంచడం చాలా మంచిది. మీ అకౌంట్ వివరాలు క్రమం తప్పకుండా పరిశీలించి, అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే వెంటనే మీ SBI బ్రాంచ్ ద్వారా ఫిర్యాదు చేయాలి. ఆర్థిక సైబర్ మోసానికి గురైతే భారతదేశంలో 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి, అధికారిక నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
ఈ ఘటనపై SBI స్పందిస్తూ, సైబర్ భద్రతా నిపుణుల సహాయంతో సమగ్ర పరిశీలన చేపట్టినట్లు తెలిపింది. అంతేకాదు, దీని వలన ప్రధాన బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఆర్థిక పనితీరుపై గణనీయమైన ప్రభావం లేదని తెలిపింది. అయితే, డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలు పెరుగుతున్న ఈ కాలంలో, బ్యాంకుల భద్రతా చర్యలతో పాటు వినియోగదారుల అప్రమత్తత కూడా ఎంతో అవసరం అని గమనించాలి.