EPFO Whatsapp: ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) వివరాలను తెలుసుకోవడానికి ఇకపై ప్రతిసారీ ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ లేదా ఆఫీస్ లను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. ఎంప్లాయిస్ సౌకర్యార్ధం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన సభ్యుల కోసం వాట్సాప్ ఆధారిత సేవలు ప్రారంభించింది. ఈ కొత్త సదుపాయం ద్వారా PF బ్యాలెన్స్, పాస్ బుక్ వివరాలు మరియు అకౌంట్ నుంచి జరిగిన లావాదేవీల సమాచారాన్ని మొబైల్ లోనే వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఎంప్లాయిస్ తమ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ యొక్క వివరాలు చాలా సులభంగా మరియు వేగంగా తెలుసుకోవడానికి వీలుగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అందించిన కొత్త సర్వీస్ ఈ ఈపీఎఫ్ఓ వాట్సాప్ సర్వీస్. 2026 నవంబర్ 1 న న్యూఢిల్లీలో జరిగిన EPFO 74 వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ ఈ సేవలను ప్రారంభించారు.
అంటే, ఈ కొత్త సర్వీస్ ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త సర్వీస్ ద్వారా ద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) సభ్యులు వాట్సాప్ ద్వారా PF బ్యాలెన్స్, పాస్ బుక్ వివరాలు మరియు అకౌంట్ నుంచి జరిగిన లావాదేవీ వంటి వివరాలు ఇన్స్టాంట్ గా తెలుస్కోవచ్చు.
ఈపీఎఫ్ఓ అధికారిక ప్రకటన ప్రకారం, ఈ కొత్త సర్వీస్ ద్వారా సభ్యులు తమ PF ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ను తెలుసుకోవచ్చు. అలాగే, ఖాతాలో ఇటీవల జరిగిన ఐదు లావాదేవీల వివరాలు కూడా చూడవచ్చు. అంతేకాదు, పాస్ బుక్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇందులో పొందవచ్చు. వీటితో పాటు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన (PMVBRY) కు సంబంధించిన అవసరాలను పూర్తి చేయడంలో సభ్యులకు వ్యక్తిగత మార్గదర్శకత్వం మరియు సహాయం ఈ సర్వీస్ ద్వారా అందించనున్నారు.
సాధారణ PF సేవలను ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం మరియు చిన్న చిన్న సందేహాల కోసం ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని ఈపీఎఫ్ఓ తెలిపింది.
Also Read: Jio Best Plans: అతి చవక ధరలో జియో బెస్ట్ ప్లాన్స్ కోసం చూస్తుంటే ఒక లుక్కేయండి.!
ఈ కొత్త సర్వీస్ పొందేందుకు ఈపీఎఫ్ఓ ధృవీకరించిన అధికారిక WhatsApp నంబర్ ను మాత్రమే ఉపయోగించాలి. ఈపీఎఫ్ఓ అధికారిక X అకౌంట్ నుంచి అందించిన ట్వీట్ ప్రకారం, +918796441800 నంబర్ ను వాట్సాప్ సర్వీస్ నెంబర్ గా వెల్లడించింది. యూజర్ వాట్సాప్ అకౌంట్ నుంచి ఈ నెంబర్ లో Hi అని మెసేజ్ పంపించాలి. ఈ చాట్ లో మెసేజ్ పంపిన తర్వాత అందుబాటులో ఉండే సూచనలను అనుసరించాలి.
కాబట్టి, EPFO అధికారిక వెబ్ సైట్ లేదా ధృవీకరించిన సమాచార మార్గాల ద్వారా నంబర్ ను నిర్ధారించుకున్న తర్వాతే ఉపయోగించడం మంచిది. గుర్తు తెలియని నంబర్లకు OTP, UAN పాస్ వర్డ్, బ్యాంక్ వివరాలు పంపకూడదు.