How to protect your privacy online explained in telugu
నేటి డిజిటల్ యుగంలో మన రోజువారీ జీవితంలో చాలా భాగం ఆన్ లైన్ లోనే గడుస్తోంది. బ్యాంకింగ్, షాపింగ్, సోషల్ మీడియా, ఉద్యోగం మరియు ఎడ్యుకేషన్ వంటి అనేక కార్యకలాపాల కోసం ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నాం. అయితే, ఇదే అదనుగా సైబర్ నేరాలు, డేటా చోరీ, ఫిషింగ్ దాడులు, ఐడెంటిటీ దొంగతనం వంటి అనేక ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే, ఆన్ లైన్ లో వ్యక్తిగత Privacy ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైన మరియు అవసరమైన విషయంగా మారింది.
ఆన్లైన్ లో మీ వ్యక్తిగత ప్రైవసీని సురక్షితం చేయడానికి మీరు కొన్ని సూత్రాలు పాటించాలి. ఇందులో మీ అకౌంట్ లకు బలమైన పాస్ వర్డ్ లను ఉపయోగించడం, టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) మరియు బ్యాంక్ మరియు ఈమెయిల్ ఖాతాలను తరచుగా పరిశీలించడం వంటి మరిన్ని టిప్స్ తీసుకుని మీ మీ వ్యక్తిగత ప్రైవసీ ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.
ప్రతి ఖాతాకు వేర్వేరు పాస్ వర్డ్ లను ఉపయోగించండి. అంతేకాదు, ఈ పాస్ వర్డ్ లో పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక గుర్తులు కలిపి కనీసం 12 అక్షరాల పొడవు ఉండాలి. సులభంగా ఊహించగల సమాచారాన్ని పాస్ వర్డ్ గా పెట్టవద్దు. అంటే, పుట్టిన తేదీ లేదా మొబైల్ నెంబర్ లేదా 1234 వంటి ఈజీగా పాస్ వర్డ్ పెట్టొద్దు.
మీ బలమైన పాస్ వర్డ్ తో పాటు ఓటీపీ లేదా ఆ థెంటికేటర్ యాప్ ద్వారా రెండో స్థాయి భద్రతను అందించే 2FA ను అన్ని ముఖ్యమైన ఖాతాల్లో ఆన్ చేయండి. ఇలా చేస్తే మీ పాస్ వర్డ్ తెలిసినా కూడా ఇతరులు మీ ఖాతాలోకి సులభంగా ప్రవేశించే అవకాశం ఉండదు.
మొబైల్ ఫోన్ లో ఇన్‌స్టాల్ చేసే యాప్ లకు కెమెరా, మైక్రోఫోన్, కాంటాక్ట్ మరియు లొకేషన్ వంటి అత్యంత గోప్యంగా ఉంచే అనుమతులను అవసరమైతేనే ఇవ్వండి. మీరు ఉపయోగించని లేదా చాలా తక్కువగా ఉపయోగించే యాప్ ఏదైనా ఉంటే దాని అనుమతులు తొలగించండి.
ఈమెయిల్, SMS లేదా సోషల్ మీడియాలో వచ్చే తెలియని లింక్ లను తెరవకండి. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు లేదా ప్రముఖ కంపెనీల పేరుతో వచ్చే ఫిషింగ్ SMS పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రస్తుతం అలాంటి లింక్స్ యూజర్ ప్రైవసీకి అధిక భంగం కలిగించే ప్రధాన సోర్స్ లుగా చెబుతున్నారు.
స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, బ్రౌజర్ మరియు యాప్ లను తాజా వెర్షన్ కు అప్‌డేట్ చేయడం వల్ల భద్రతా లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దబడతాయి. మీకు అందుబాటులో ఉంటే ఆటోమేటిక్ అప్‌డేట్ లను ఎంచుకోండి.
బ్యాంక్ స్టేట్‌మెంట్ లు, క్రెడిట్ కార్డ్ లావాదేవీలు, ఈమెయిల్ లాగిన్ అలర్ట్ లను క్రమం తప్పకుండా పరిశీలించండి. వీటిలో ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సంబంధిత సంస్థలకు వెంటనే సమాచారం ఇవ్వండి.
Also Read : OnePlus N6x: టాప్ ఫీచర్లు మరియు అంచనా ప్రైస్ పై లుక్కేద్దామా.!
ముఖ్యమైన ఫోటోలు, పత్రాలు, ఇతర ఫైళ్లను క్లౌడ్ లేదా బాహ్య స్టోరేజ్ తో ఆప్షన్ క్రమం తప్పకుండా బ్యాకప్ చేయండి. ర్యాన్సమ్ వేర్ లేదా డేటా నష్టం జరిగినా మీ సమాచారం సురక్షితంగా ఉంటుంది.