AI Generated: ఏఐ నకిలీ ఫోటోలు అండ్ వీడియోలు ఎలా గుర్తించాలి .. బెస్ట్ ట్రిక్స్ తెలుసుకోండి.!
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది
ఈ కొత్త టెక్నాలజీతో ఎన్నో పనులు సునాయాసంగా చేసే అవకాశం అందించింది
AI చిత్రాలు, డీప్ ఫేక్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి

AI Generated: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ కొత్త టెక్నాలజీతో ఎన్నో పనులు సునాయాసంగా చేసే అవకాశం అందించింది. అయితే, ఫొటోలు మరియు వీడియోలు కూడా నిజమైన వాటిలా కనిపించే విధంగా క్రియేట్ చేయడం కూడా చాలా సులభమైంది. ప్రముఖ వ్యక్తులు మాట్లాడుతున్నట్లు, జరగని సంఘటనలు జరిగినట్లు చూపించే AI చిత్రాలు, డీప్ ఫేక్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. ప్రజలు ఇలాంటి కంటెంట్ ను నిజమని నమ్మితే తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఇది ప్రజల సెక్యూరిటీ మరియు ప్రైవసీ కి కూడా భంగం కలిగించే అవకాశం ఉంది. ఏఐ నకిలీ ఫోటోలు అండ్ వీడియోలు గుర్తించి వాటిని అరికట్టడం అవసరం. కొన్ని సులభమైన పద్ధతులతో AI ఫొటోలు మరియు వీడియోలను గుర్తించే ప్రయత్నం చేయవచ్చు. ఆ వివరాలు ఈ రోజు ఈ ప్రత్యేక కథనంలో అందించాము.
AI Generated ఫోటోలు ఎలా గుర్తించాలి?
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ క్రియేట్ చేసిన ఫోటోలు మరియు వీడియోలను గుర్తించడానికి కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఈ ట్రిక్స్ ద్వారా ఎవరైనా ఫేక్ వీడియోలు క్రియేట్ చేసినట్లయితే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి ట్రిక్స్ ను ఇప్పుడు మనం ఒక్కొక్కటి క్లియర్ గా తెలుసుకుందాం.
ఫొటోలోని చిన్న వివరాలు గమనించండి
ఏఐ తో రూపొందించిన చిత్రాలలో కొన్నిసార్లు చేతివేళ్లు అసహజంగా ఉండటం లేదా కళ్ల ఆకారంలో తేడాలు ఉండడం లేదా చెవులు సరిగ్గా లేకపోవడం వంటి లోపాలు కనిపిస్తాయి. అలాగే, బ్యాక్ గ్రౌండ్ లోని వస్తువులు, అక్షరాలు, నీడలు మరియు ప్రతిబింబాలను కూడా మీరు చాలా నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇలా మీరు ఏఐ ఫేక్ చిత్రాన్ని పసిగట్టవచ్చు. అయితే, ఆధునిక AI చిత్రాల్లో ఈ లోపాలు తగ్గుతున్నాయని గుర్తుంచుకోవాలి.
వీడియోలో ముఖ కదలికలు పరిశీలించండి
డీప్ ఫేక్ వీడియోల్లో వ్యక్తుల పెదవుల కదలికలు మరియు మాటల మధ్య సమన్వయం సరిగ్గా లేకపోవచ్చు. ముఖ కవళికలు, కనురెప్పల కదలికలు, గొంతు ధ్వని సహజంగా ఉన్నాయో లేదో గమనించండి. ముఖం చుట్టూ అసహజమైన మార్పులు కనిపించినా కూడా మీరు అనుమానించాలి. ఇవన్నీ కూడా అది ఫేక్ వీడియో అని తెలిపే సంకేతాలు అవుతాయి.
కెమెరా ద్వారా తనిఖీ చేయండి
అనుమానం ఉన్న ఫొటోను Google Lens ద్వారా అప్ లోడ్ చేసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయవచ్చు. అదే చిత్రం గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా ప్రచురితమైందా లేదా ఈ ఫోటో అసలు సందర్భం ఏమిటి అనే వివరాలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
AI డిటెక్షన్ టూల్స్ ఉపయోగించడం
Hive Moderation మరియు AI or Not వంటి ఆన్ లైన్ టూల్స్ ద్వారా ఫొటోలు లేదా వీడియోలను పరిశీలించవచ్చు. ఈ టూల్స్ కంటెంట్ AI తో రూపొందించబడిందా లేదా అనే అంచనాను అందిస్తాయి. అయితే, వీటి ఫలితాలు 100 శాతం ఎల్లప్పుడూ కచ్చితమైనవి అని ఖచ్చితంగా చెప్పలేము.
వార్తల అధికారికత పరిశీలించండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూడగానే వెంటనే నమ్మకండి. ఆ వార్తకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్లు, విశ్వసనీయ మీడియా సంస్థలు మరియు సంబంధిత ప్రభుత్వ విభాగాల ప్రకటనలను పరిశీలించండి.
కంటెంట్ క్రియేషన్ వివరాలను చూడండి
కొన్ని చిత్రాల్లో C2PA Content Credentials వంటి డిజిటల్ ప్రోవెనెన్స్ వివరాలు ఉంటాయి. అవి ఆ కంటెంట్ ఎలా రూపొందించబడింది అని తెలుసుకోవడానికి సహాయపడతాయి.
ప్రతి వైరల్ ఫోటో లేదా వీడియో నిజమేనని భావించకూడదు. ఒక సమాచారాన్ని షేర్ చేసే ముందు దాని మూలం, సందర్భం మరియు విశ్వసనీయతను నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. AI టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కూడా కొన్ని నిష్టమైన పరిశీలనలో మనకు దొరికిపోయే అవకాశం ఉంటుంది.
అయితే, రాబోయే రోజుల్లో ఏఐ మరింత శక్తివంతంగా మారితే మాత్రం ఇప్పుడు మనం చెప్పిన విషయాల్లో అన్ని పని చేస్తాయని ఖచ్చితంగా చెప్పలేము.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.
View full profile
