How Smart Homes Are Changing Daily Life
ఒకప్పుడు ఇంట్లో ఉన్న లైట్ ఆన్ లేదా ఆఫ్ చేయాలంటే స్విచ్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. ఫ్యాన్ స్పీడ్ మార్చాలన్నా, టీవీ ఆఫ్ చేయాలంటే రిమోట్ అవసరమయ్యేది. Smart Homes వచ్చిన తర్వాత మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఉన్నచోటు నుంచి కదలకుండా జస్ట్ “లైట్ ఆన్ చేయి” లేదా “ఏసీ 24 డిగ్రీలకు సెట్ చేయి” లేదా “డోర్ కెమెరా చూపించు” అని వాయిస్ కమాండ్ ఇస్తే చాలు, కొన్ని సెకన్లలోనే అన్ని పనులు పూర్తవుతున్నాయి. ఇదే స్మార్ట్ హోమ్ టెక్నాలజీ ప్రభావం మరియు ఇది ప్రతి ఒక్కరు కోరుకునే టెక్నాలజీ గా కూడా మారింది.
ఇంట్లో ఉన్న లైట్లు, ఫ్యాన్లు, ఎయిర్ కండిషనర్, టీవీ, డోర్ లాక్, సెక్యూరిటీ కెమెరాలు, స్మార్ట్ స్పీకర్, గృహోపకరణాలు వంటి పరికరాలను ఇంటర్నెట్ ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానించి మొబైల్ యాప్ లేదా వాయిస్ కమాండ్ తో నియంత్రించే వ్యవస్థనే స్మార్ట్ హోమ్ అంటారు.
అంతేకాదు, ఈ పరికరాలు వినియోగదారుడి అలవాట్లను అర్థం చేసుకుని, కొన్ని పనులు వాటంతట అవే స్వయంచాలకంగా నిర్వహించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి.
వాయిస్ అసిస్టెంట్ సహాయం తో చేతులకు పని చెప్పకుండా అనేక పనులు చేయవచ్చు. వంట చేస్తున్నప్పుడు లేదా ఇతర పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ వాయిస్ కమాండ్ ఇవ్వడం ద్వారా లైట్లు, సంగీతం, టీవీ వంటి పరికరాలను నియంత్రించడం సాధ్యమవుతోంది.
స్మార్ట్ డోర్ బెల్, సెక్యూరిటీ కెమెరాలు, మోషన్ సెన్సర్లు, స్మార్ట్ డోర్ లాక్స్ వంటి పరికరాలు ఇంటి భద్రతను మరింత బలోపేతం చేస్తున్నాయి. ఎవరైనా ఇంటి వద్దకు వచ్చినప్పుడు మొబైల్ కు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. యూజర్ దూరంలో ఉన్నప్పటికీ ఇంటికి వచ్చిన వారితో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది.
స్మార్ట్ హోమ్ టెక్ తో వచ్చే స్మార్ట్ లైటింగ్, స్మార్ట్ ప్లగ్, ఎనర్జీ మానిటరింగ్ పరికరాలు అవసరం లేని సమయంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతున్నాయి. టైమర్ లు మరియు ఆటోమేషన్ ఫీచర్ల ద్వారా విద్యుత్ బిల్లులను కూడా కొంత మేర తగ్గించుకోవచ్చు.
ఇంట్లో వృద్ధులు లేదా చిన్న పిల్లలు ఉన్న కుటుంబాలకు స్మార్ట్ హోమ్ పరికరాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో అలర్ట్ పంపడం, డోర్ యాక్టివిటీని గమనించడం, ఆరోగ్య సంబంధిత రిమైండర్ లు ఇవ్వడం వంటి సౌకర్యాలు మీకు మరింత భద్రత అందిస్తాయి.
స్మార్ట్ టీవీలు మరియు స్మార్ట్ స్పీకర్లు మరియు హోమ్ థియేటర్ వ్యవస్థలు కలిసి ఒకే ఎకోసిస్టమ్ లో పనిచేస్తాయి. ఈ సిస్టం తో కేవలం ఒకే కమాండ్ తో టీవీ ఆన్ చేయడం, లైట్ల ప్రకాశాన్ని తగ్గించడం, సంగీతాన్ని ప్లే చేయడం వంటి పనులు ఆటోమేటిక్ గా జరిగేలా సెట్ చేసుకోవచ్చు.
స్మార్ట్ హోమ్ తో వచ్చే ఆటోమేషన్ తో ప్రతి రోజు ఒకే పనిని మళ్లీ మళ్లీ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. ఉదయం నిర్ణీత సమయానికి కర్టెన్లు తెరుచుకోవడం, కాఫీ మెషిన్ ఆన్ కావడం, సాయంత్రం లైట్లు ఆటోమేటిక్ గా వెలగడం వంటి ఆటోమేషన్ లు రోజువారీ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తున్నాయి.
Also Read : vivo S2 లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన వివో .. స్టైలిష్ డిజైన్ తో లాంచ్ అవుతుంది.!
స్మార్ట్ హోమ్ లు అనేక ప్రయోజనాలు అందిస్తున్నప్పటికీ కొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా, సెటప్ ప్రారంభంలో ఖర్చు ఎక్కువగా ఉండవచ్చు. ఈ టోటల్ ఆటోమేషన్ సెటప్ కోసం స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. సైబర్ భద్రత, గోప్యత పై ప్రత్యేక శ్రద్ధ అవసరం. చివరిగా, అన్ని పరికరాలు ఒకే ఎకోసిస్టమ్ లో పనిచేయకపోవచ్చు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత అభివృద్ధి చెందడంతో స్మార్ట్ హోమ్ లు వినియోగదారుల అలవాట్లను విశ్లేషించి అవసరాలను ముందుగానే అంచనా వేసే స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ కొత్త టెక్ తో విద్యుత్ వినియోగాన్ని స్వయంచాలకంగా నియంత్రించడం, గృహ భద్రతను మెరుగుపరచడం, ఆరోగ్య సంబంధిత సూచనలు ఇవ్వడం వంటి కొత్త అవకాశాలు భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశం ఉంది.