what is el nino effect and when it affects india explained in telugu
El nino effect: ఇటీవలి కాలంలో వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు మరియు అనియంత్రిత వర్షాలు గురించి మనం తరచుగా వింటున్నాం. ఈ పదాల్లో ఎక్కువగా వినిపించేది ఎల్‌నినో ఎఫెక్ట్ ఒకటి. ప్రపంచ వాతావరణ వ్యవస్థను ప్రభావితం చేసే ఈ ప్రక్రియ కారణంగా అనేక దేశాల్లో వాతావరణ పరిస్థితులు మారిపోతుంటాయి. ముఖ్యంగా, భారత్ లో రుతుపవనాలు, వర్షపాతం, ఉష్ణోగ్రతల పై ఎల్‌నినో ఎఫెక్ట్ గణనీయంగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతారు. అయితే, అసలు ఎల్‌నినో అంటే ఏమిటి? ఇది ఎలా ఏర్పడుతుంది? భారత్ పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? అనే విషయాలు ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం.
ఎల్‌నినో ఎఫెక్ట్ అనేది పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల జలాలు సాధారణ స్థాయి కంటే ఎక్కువ వేడెక్కే ప్రక్రియ. స్పానిష్ భాషలో “El Niño” అంటే “చిన్న బాలుడు” లేదా “క్రైస్ట్ చైల్డ్” అని అర్థం వస్తుంది.
సాధారణంగా తూర్పు నుంచి పడమర దిశగా వీచే ట్రేడ్ గాలులు పసిఫిక్ సముద్ర జలాలను ఆసియా వైపు నెడతాయి. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ గాలులు బలహీనపడటంతో సముద్ర జలాలు మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతంలో వేడెక్కుతాయి. ఈ పరిస్థితినే ఎల్‌నినో అంటారు.
ఎల్‌నినో ఏర్పడటానికి నాలుగు ముఖ్యకారణాలు ఉన్నట్లు నిపుణులు చెబుతారు. ఇందులో, మొదటిది ట్రేడ్ గాలులు బలహీనపడటం. రెండోది పసిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెపెరుగుతుంది. మూడవది సముద్ర ప్రవాహాలలో మార్పులు నాలుగోది వాతావరణ పీడన వ్యవస్థల్లో అసమతుల్యత అని చెబుతారు. ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, తుఫానులు మరియు ఉష్ణోగ్రత లపై ప్రభావం చూపుతాయి.
భారత్ లో వ్యవసాయం ఎక్కువగా నైరుతి రుతుపవనా లపై ఆధారపడి ఉంటుంది. ఎల్‌నినో సంవత్సరాల్లో సాధారణంగా 4 విధాలుగా ప్రభావం చూపుతుంది. అందులో మొదటిది ఎల్‌నినో ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. రెండోది వేసవి కాలంలో అధిక వేడి, హీట్ వేవ్ పరిస్థితులు ఎక్కువగా కనిపించవచ్చు. వాస్తవానికి, ఈ సంవత్సరం మే నెలలో దేశవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం మనం చూశాం.
ఇలా వర్షాలు కనుక తగ్గితే పంట దిగుబడి పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వరి, పత్తి, పప్పు ధాన్యాల సాగు పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది మరియు చాలా ప్రమాదమైన కారణంగా చెప్పవచ్చు. అదేమిటంటే, రిజర్వాయర్లు, చెరువులు, భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అంటే, తీవ్రమైన నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది.
Also Read: AC Electricity Bill తగ్గించుకోవడానికి ఈ 7 సులభమైన చిట్కాలు.!
ఎల్‌ని నో ఒక నిర్దిష్ట తేదీన భారత్ లోకి ప్రవేశించదు. ఇది సముద్ర వాతావరణ చక్రంలో క్రమ క్రమంగా అభివృద్ధి చెందే ప్రక్రియ. ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది. వేసవి చివరి నుంచి మాన్సూన్ సీజన్ వరకు దీని ప్రభావం కనిపించవచ్చు. అంటే, జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య రుతుపవనాల పై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది.
అయితే, వాతావరణ సంస్థలు సముద్ర ఉష్ణోగ్రతలు మరియు గాలి పీడన మార్పులను పరిశీలించి ఎల్‌నినో ఏర్పడే అవకాశాలను ముందుగానే అంచనా వేస్తాయి. ఈ ఎఫెక్ట్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే సహజ వాతావరణ ప్రక్రియ. ఇది ప్రపంచ వాతావరణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.