Chat GPT అండ్ Gemini వంటి విదేశీ AI మోడల్స్ కి పోటీగా భారత్ సొంత AI మోడళ్లు లాంచ్ .. ఎలా ఉన్నాయంటే.!

Highlights

టెక్నాలజీ రంగంలో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న భారత్

సొంత ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మూడు స్వదేశీ ఏఐ మోడళ్లను విడుదల చేసింది

ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలో వీటిని అధికారికంగా ఆవిష్కరించారు

టెక్నాలజీ రంగంలో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న భారత్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో కూడా మరో కీలక ముందడుగు వేసింది. Chat GPT అండ్ Gemini విదేశీ ఏఐ టెక్నాలజీలపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ అవసరాలకు అనుగుణంగా సొంత ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మూడు స్వదేశీ ఏఐ మోడళ్లను విడుదల చేసింది. India AI Mission కింద EKA-1, Dhīr 2B, Dhīr 5B పేర్లతో ఈ మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2026 నవంబర్ 3వ తేదీ న్యూఢిల్లీలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలో వీటిని అధికారికంగా ఆవిష్కరించారు. భారతీయ భాషలు, డేటా భద్రత మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా మెరుగైన AI సేవలను అందించడం ఈ మోడళ్ల ప్రధాన లక్ష్యంగా వెల్లడించారు.

EKA-1 AI మోడల్ ప్రత్యేకతలు

Soket Labs Technology and Research సంస్థ EKA-1 మోడల్‌ ను అభివృద్ధి చేసింది. ఇందులో 26.3 బిలియన్ పారామీటర్లు ఉండగా, సుమారు 7.5 ట్రిలియన్ టోకెన్లతో దీనికి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇంగ్లీష్‌ తో పాటు భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌ లో ఉన్న మొత్తం 22 భాషలకు ఈ ఇండియన్ ఏఐ మోడల్ మద్దతు ఇస్తుంది.

గణిత సమస్యలు పరిష్కరించడం, కోడింగ్, తార్కిక విశ్లేషణ, క్లిష్టమైన పనులు నిర్వహించడం వంటి చాలా సామర్థ్యాలతో ఈ మోడల్ ని రూపొందించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఇది ఉపయోగపడేలా అభివృద్ధి చేశారు.

Dhīr 2B, Dhīr 5B మోడల్స్ ప్రత్యేకతలు

ZenteiQ AiTech Innovations సంస్థ కొత్త Dhīr 2B అండ్ Dhīr 5B మోడళ్లను రూపొందించింది. ఇవి రెండూ కూడా ఓపెన్ సోర్స్ AI మోడళ్లు. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్ తో పాటు 10 భారతీయ భాషలకు ఈ మోడల్స్ మద్దతు ఇస్తాయి. వీటిని స్థానిక కంప్యూటర్లు మరియు అనుకూలమైన మొబైల్ పరికరాల్లో ఉపయోగించుకునేలా రూపొందించారు. ముఖ్యంగా, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా పనిచేసే సామర్థ్యం వీటి ప్రత్యేకత అని కంపెనీ ప్రత్యేకంగా పేర్కొంది.

డాక్యుమెంట్లలో సమాచారాన్ని వెతకడం, అవసరమైన వివరాలు సేకరించడం, కొన్ని పనులు ఆటోమేట్ చేయడం వంటి సర్వీస్ లకు ఈ రెండు మోడల్స్ ఉపయోగపడతాయి. రక్షణ, ప్రభుత్వ, విద్యా మరియు పారిశ్రామిక రంగాల్లో వీటిని వినియోగించవచ్చు. లోకల్ డేటాను నిర్వహించడం ద్వారా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ భద్రతకు కూడా ఈ మోడల్స్ తో అధిక ప్రాధాన్యత లభిస్తుంది.

India AI Mission లక్ష్యం ఏమిటి?

భారత్‌ లో సొంత AI సాంకేతికతను అభివృద్ధి చేయడం, పరిశోధకులు, స్టార్టప్‌ లు, విద్యార్థులకు అవసరమైన వనరులను అందించడం India AI Mission ముఖ్య ఉద్దేశం. 2024 మార్చి 7న కేంద్ర కేబినెట్ ఈ కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. ఈ మిషన్ కింద దేశీయ సంస్థలకు కంప్యూటింగ్ సదుపాయాలు మరియు పరిశోధనలకు ఆర్థిక సహకారం అందిస్తున్నారు.

AIKosh వేదిక ద్వారా ఈ మోడళ్లను పరిశోధకులు, విద్యార్థులు, ఇన్వెంటర్స్, ఇతర వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా ఈ మూడు మోడళ్లు భారత AI రంగంలో స్వదేశీ ఆవిష్కరణలకు కొత్త అవకాశాలను తెరవనున్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile