Facebook WhatsApp and Instagram services down globally users facing problems
Facebook, ఇంస్టాగ్రామ్ మరియు WhatsApp సేవలు ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయినట్లు యూజర్లు రిపోర్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే ప్రముఖ ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఈరోజు రాత్రి 7 గంటల నుంచి అకస్మాత్తుగా నిలిచిపోయాయి. Meta కు చెందిన ఈ మూడు ప్లాట్ ఫామ్స్ సర్వీసుల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో లక్షల మంది వినియోగదారులు లాగిన్ సమస్యలు, మెసేజ్‌లు పంపడంలో అంతరాయం, మరియు ఫీడ్ లోడ్ కాకపోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలిపారు.
భారత్ తో పాటు అమెరికా, యూరప్, ఆసియా, మధ్య ప్రాచ్య దేశాల్లోని యూజర్లు ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ మరియు వాట్సాప్ సర్వీస్ సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. కొందరు ఫేస్ బుక్ ఖాతాల నుంచి ఆటోమేటిక్ గా లాగ్ అవుట్ కాగా, మరికొందరు తిరిగి లాగిన్ కాలేక పోయినట్లు తెలిపారు. అలాగే, ఇంస్టాగ్రామ్ లో ఫీడ్ రిఫ్రెష్ కాకపోవడం, వాట్సప్ లో మెసేజ్ లను పంపడంలో ఆలస్యం వంటి సమస్యలు నమోదయ్యాయి.
సర్వీస్ అవుటేజీలను ట్రాక్ చేసే DownDetector వంటి ప్లాట్ ఫారమ్ లలో వేలాది ఫిర్యాదులు నమోదయ్యాయి. ఫేస్ బుక్ కి సంబంధించిన సమస్యల పై లక్షకు పైగా రిపోర్టులు నమోదైనట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇంస్టాగ్రామ్, వాట్సాప్ సర్వీస్ పైన కూడా పెద్ద ఎత్తున రిపోర్ట్స్ నమోదయ్యాయి.
Meta ప్రతినిధి ఆండీ స్టోన్ ఈ సమస్య పై స్పందిస్తూ, కొంతమంది వినియోగదారులు తమ సేవలను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను పరిష్కరించేందుకు ఇంజనీరింగ్ టీమ్స్ పనిచేస్తున్నాయని తెలిపారు. అయితే సమస్యకు గల ఖచ్చితమైన కారణాలు మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
అకస్మాత్తుగా ఖాతాల నుంచి లాగ్ అవుట్ కావడంతో పలువురు యూజర్లు తమ అకౌంట్ హ్యాక్ అయ్యాయేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇది తమ వ్యక్తిగత అకౌంట్ లో వచ్చిన సమస్య కాదని, Meta సర్వర్లలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ఫేస్ బుక్ సర్వీస్ నిలిచిపోయినట్లు తర్వాత గుర్తించారు.
Also Read: Samsung Smart Tv సిరీస్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించిన అమెజాన్.!
ప్రస్తుతం Meta సాంకేతిక బృందాలు సమస్యలు పరిష్కరించే పనిలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో సేవలు క్రమంగా పునరుద్ధరించబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, పూర్తి యూజర్లకు పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ మరియు వాట్స్ అప్ వంటి సర్వీస్ లు రోజువారీ కమ్యూనికేషన్ లో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ గ్లోబల్ అవుటేజ్ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. మెటా నుంచి అధికారిక అప్‌డేట్ వచ్చిన వెంటనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.