SIM Swap : మీ సిమ్ కార్డు పైన మీకు తెలియకుండా మరో వ్యక్తి యాక్సెస్ అందుకోవచ్చా.!

Highlights

మీ సిమ్ కార్డు పైన మీకు తెలియకుండా మరో వ్యక్తి యాక్సెస్ అందుకునే అవకాశం

ప్రతి ఒక్కరు కూడా ‘సిమ్ స్వాప్’ మోసం గురించి తప్పకుండా తెలుసుకోవాలి

సిమ్ స్వాప్ మోసాలతో మీ వ్యక్తిగత జీవితానికి మరియు బ్యాంకింగ్ వంటి ఫైనాన్షియల్ జీవితానికి కూడా ప్రమాదం

SIM Swap : మీ సిమ్ కార్డు పైన మీకు తెలియకుండా మరో వ్యక్తి యాక్సెస్ అందుకునే అవకాశం ఉండొచ్చని ఈ మధ్య చాలా కధనాలు వస్తున్నాయి. మొబైల్ నంబర్‌ అంటే కేవలం కాలింగ్ డేటా మాత్రమే కాదు OTP లతో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్, సోషల్ మీడియా అకౌంట్స్ మరియు అనేక ఇతర ముఖ్యమైన సర్వీస్ లకు ఇదే మూలాధారంగా మారింది. అందుకే, ప్రతి ఒక్కరు కూడా ‘సిమ్ స్వాప్’ మోసం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ న్యూ టెక్ మోసం ద్వారా సైబర్ నేరగాళ్లు మీకు తెలియకుండానే మీ మొబైల్ నంబర్‌ పై నియంత్రణ పొందే అవకాశం ఉంది. ఈ సిమ్ స్వాప్ మోసాలతో మీ వ్యక్తిగత జీవితానికి మరియు బ్యాంకింగ్ వంటి ఫైనాన్షియల్ జీవితానికి కూడా ప్రమాదం ఏర్పడవచ్చు.

అసలు SIM Swap మోసం అంటే ఏమిటి?

సిమ్ స్వాప్ మోసాలు ఎలా చేస్తారో చూసే ముందు అసలు సిమ్ స్వాప్ మోసం అంటే ఏమిటో తెలియాలి. సాధారణంగా మనం ఉపయోగించే మొబైల్ నంబర్‌ ను మరో SIM కార్డుకు ట్రాన్స్ఫర్ చేయడాన్నే టెక్ భాషలో సిమ్ స్వాప్ అంటారు. ఇది సాధారణంగా టెలికాం కంపెనీలు ఉపయోగించే విధానమే.

అయితే, సైబర్ నేరగాళ్లు ఈ విధానాన్ని దుర్వినియోగం మీ పేరుతో కొత్త SIM కార్డు పొందేందుకు ఈ సర్వీస్ ను ఉపయోగిస్తుంటారు. ఇందుకోసం నకిలీ గుర్తింపు పత్రాలు, వ్యక్తిగత వివరాలు లేదా ఇతర మోసపూరిత పద్ధతులు కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది.

సైబర్ నేరగాళ్ల ప్రయత్నాలు ఫలిస్తే, కొత్త సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత మీరు ఉపయోగిస్తున్న అసలు సిమ్ కార్డు పనిచేయడం ఆగిపోవచ్చు. ఇలా కనుక జరిగితే మీ నంబర్‌ కు వచ్చే OTP లు, బ్యాంకింగ్ అలర్ట్‌ లు, కాల్స్ మరియు మెసేజ్‌ లు కూడా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

SIM Swap మోసాన్ని ఎలా గుర్తించాలి?

ఈ సిమ్ కార్డు పైన సిమ్ స్వాప్ జరిగితే నాలుగు హింట్స్ ద్వారా ఈ విషయాన్ని మీరు గుర్తించవచ్చు. ఆ నాలుగు హింట్స్ ఇప్పుడు చూద్దాం.

  • అకస్మాత్తుగా మీ ఫోన్‌ లో నెట్‌ వర్క్ సిగ్నల్ మాయం అవుతుంది.
  • SIM పనిచేయడం లేదని మీకు మెసేజ్ రావడం.
  • మీరు రిక్వెస్ట్ చేయకుండా SIM మార్పు గురించి టెలికాం ఆపరేటర్ నుంచి సమాచారం అందుకోవడం.
  • మీకు తెలియని బ్యాంకింగ్ లావాదేవీల అలర్ట్‌లు అందుకోవడం.

ఇలా పైన తెలిపిన ఏదైనా యాక్షన్ మీ సిమ్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా అందుకుంటే, మీ సిమ్ కార్డు సిమ్ స్వాప్ మోసానికి గురైనట్టు మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి.

మోసానికి గురైతే ఏం చేయాలి?

మీ సిమ్ కార్డు సిమ్ స్వాప్ మోసానికి గురైనట్లు అనుమానం వచ్చిన వెంటనే మీ టెలికాం ఆపరేటర్‌ ను సంప్రదించి సిమ్ కార్డ్ సర్వీస్ ను బ్లాక్ చేయించండి. బ్యాంకును సంప్రదించి అనుమానాస్పద ట్రాన్సాక్షన్ లను బ్లాక్ చేయించండి. అలాగే, భారత సైబర్ క్రైమ్ హెల్ప్‌ లైన్ నంబర్ 1930 కు కాల్ చేసి జరిగిన విషయం వెల్లడించి కంప్లైంట్ రిజిస్టర్ చేయించండి లేదా cybercrime.gov.in వెబ్‌ సైట్‌ లో మీరే స్వయంగా కంప్లైంట్ రిజిస్టర్ చేయండి.

ఈ మోసం బారిన పడకుండా ఎలా ఉండాలి?

మీ మొబైల్ నెంబర్ కి వచ్చే OTP, బ్యాంకింగ్ వివరాలు మరియు వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచండి. ముఖ్యంగా, అనుమానాస్పద లింకుల పైన అస్సలు క్లిక్ చేయవద్దు. సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత వివరాలను ఎక్కువగా షేర్ చేయవద్దు. మీ మొబైల్ నెట్‌ వర్క్ అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతే వెంటనే టెలికాం ఆపరేటర్‌ ను సంప్రదించండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile