UMANG యాప్ డేటా లీక్ నిజమేనా.. మరి మన డేటా పరిస్థితి ఏమిటి.!
UMANG యాప్ లో డేటా లీక్ అయినట్లు ఇప్పుడు విస్తృతంగా వార్తలు వస్తున్నాయి
ఈ యాప్ ను ఉపయోగిస్తున్న లక్షలాది మంది వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది
ఇందులో యూజర్ యొక్క చాలా సున్నితమైన డేటా ఉంటుంది
యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ (UMANG) యాప్ లో డేటా లీక్ అయినట్లు ఇప్పుడు విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ యాప్ ను ఉపయోగిస్తున్న లక్షలాది మంది వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే, ఈ యాప్ లో యూజర్ యొక్క అనేక అధికారిక మరియు పర్సనల్ డేటా ఉంటుంది. ఆధార్ కార్డు మొదలుకొని EPF అకౌంట్ అకౌంట్ వరకు ఇందులో యూజర్ యొక్క చాలా సున్నితమైన డేటా ఉంటుంది.
SurveyUMANG యాప్ డేటా లీక్ నిజమేనా?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం, ఉమంగ్ యాప్ ప్రధాన సర్వర్లు హ్యాక్ అయ్యాయని లేదా మొత్తం యూజర్ డేటా బేస్ దొంగిలించబడింది, అని ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ లేదు. అయితే, ప్రధానంగా కొన్ని ప్రభుత్వ సర్వీసులకు అనుసంధానమైన API (అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్) భద్రతా లోపాలు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి.. ఈ లోపాల కారణంగా కొన్ని సర్వీసుల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసే అవకాశం ఉన్నట్లు గుర్తించారు.

నివేదికల ప్రకారం, కొంతమంది వినియోగదారుల EPFO UAN నంబర్లు, ఆధార్ కు సంబంధించిన వివరాలు, అలాగే ఇతర ప్రభుత్వ సేవలకు సంబంధించిన పరిమిత సమాచారం ప్రభావితమయ్యే అవకాశం ఉందని వెల్లడైంది. అయితే, ఈ సమాచారం మొత్తం ఇంటర్నెట్ లో బహిరంగంగా లీక్ అయిందని లేదా భారీ స్థాయిలో సైబర్ దాడి జరిగిందని నిర్ధారించే ఆధారాలు ఇప్పటివరకు బయటకు రాకపోవడం కొసమెరుపు.
Also Read: Realme Narzo 100x: లాంచ్ కంటే ముందే ఫీచర్స్ మరియు అంచనా ప్రైస్ తెలుసుకోండి.!
ప్రభుత్వం ఏం చెబుతోంది?
ఈ అంశంపై స్పందించిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) సంబంధిత భద్రతా లోపాలను పరిశీలించినట్లు తెలిపింది. ప్రభావిత API లను సవరించి, సున్నితమైన సమాచారాన్ని సురక్షితంగా నిర్వహించేలా మార్పులు చేసినట్లు కూడా వెల్లడించింది. అదనంగా భద్రతా పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేసినట్లు కూడా పేర్కొంది.
ఉమంగ్ యాప్ ను ఉపయోగించే వారు ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ డిజిటల్ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. ఎవరైనా ఫోన్ కాల్, SMS లేదా ఈమెయిల్ ద్వారా OTP, ఆధార్ నెంబర్ లేదా బ్యాంకింగ్ వివరాలు అడిగితే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకూడదు. అలాగే, అధికారిక యాప్ ను ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్షన్ కు అప్‌డేట్ చేసుకోవడం మంచిది.
మొత్తానికి, ఈ ఘటనను ఉమంగ్ యాప్ పూర్తిగా హ్యాక్ అయింది అని చెప్పడం కంటే, “కొన్ని అనుసంధానిత ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న API భద్రతా లోపాల కారణంగా సమాచారం బహిర్గతమయ్యే అవకాశం ఏర్పడిన సంఘటన అని చెప్పడం” మరింత సరైనది అవుతుంది. ఈ ఘటనపై వేగంగా స్పందించిన ప్రభుత్వం, అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంది. ఈ చర్యలతో ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
