what is Satellite Internet and How It Works and Who Should Use It
ప్రపంచం వేగంగా డిజిటల్ యుగంలోకి అడుగుపెడుతోంది. ఈ నవయుగంలో విద్య, ఉద్యోగం, వ్యాపారం, వినోదం మరియు బ్యాంకింగ్ వంటి అనేక సేవలు ఇంటర్నెట్ పైనే ఆధారపడుతోంది. అయితే, ఇప్పటికి కూడా పర్వత ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, సుదూర గ్రామాలు మరియు సముద్ర మధ్యలో ఉన్న నౌకలు వంటి అనేక ప్రాంతాల్లో నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం గా Satellite Internet ను తీసుకొచ్చారు మరియు ఇది ఇప్పుడు వేగంగా ప్రాచుర్యం పొందుతోంది.
భూమిపై ఏర్పాటు చేసిన ఫైబర్ కేబుల్ లేదా సెల్ టవర్ లకు బదులుగా భూమి చుట్టూ తిరుగుతున్న కమ్యూనికేషన్ ఉపగ్రహాల సహాయంతో యూజర్లకు ఇంటర్నెట్ సేవలు అందించడాన్ని శాటిలైట్ ఇంటర్నెట్ అంటారు. ఈ ఇంటర్నెట్ సర్వీస్ లో యూజర్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన చిన్న డిష్ యాంటెన్నా అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహంతో నేరుగా సమాచారాన్ని పంచుకుంటుంది. అందువల్ల సుదూర ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది.
శాటిలైట్ ఇంటర్నెట్ ముఖ్యంగా ఈ సేవ మూడు ప్రధాన భాగాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో మొదటిది ఉపగ్రహాలు, రెండోది గ్రౌండ్ స్టేషన్లు మరియు మూడోది యూజర్ రిసీవర్ డిష్.
ఉపగ్రహాలు భూమి చుట్టూ నిర్దిష్ట కక్ష్యలో తిరుగుతూ డేటాను ప్రసారం చేస్తాయి. ప్రస్తుతం అనేక కంపెనీలు వేల సంఖ్యలో లో ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహాలను ఉపయోగిస్తున్నాయి.
భూమిపై ఉన్న ప్రత్యేక కేంద్రాలు ప్రపంచ ఇంటర్నెట్ నెట్ వర్క్ కు అనుసంధానమై ఉపగ్రహాలకు డేటాను పంపిస్తాయి.
ఇంటి పైకప్పు పై ఏర్పాటు చేసే డిష్ యాంటెన్నా ఉపగ్రహం నుంచి వచ్చే సంకేతాలు స్వీకరించి వైఫై రౌటర్ ద్వారా ఇంటర్నెట్ ను నేరుగా యూజర్ కి అందిస్తుంది.
శాటిలైట్ కోసం ఫైబర్ అవసరం ఉండదు మరియు ఇది భూమి మీద ఎక్కడ నుంచైనా ఇంటర్నెట్ ను పొందడానికి ఇది గొప్ప మార్గం. పర్వత ప్రాంతాలు, దూర గ్రామాలు, అడవులు, ద్వీపాలు, సముద్ర ప్రయాణంలో కూడా శాటిలైట్ ఇంటర్నెట్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా, వరదలు, భూకంపాలు లేదా తుఫాన్ల వల్ల భూగర్భ కేబుల్ దెబ్బతిన్నా కూడా ఉపగ్రహాల ద్వారా కమ్యూనికేషన్ కొనసాగించే అవకాశం ఉంటుంది. అంటే, ప్రకృతి విపత్తుల సమయంలో శాటిలైట్ ఇంటర్నెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అయితే, శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ప్రారంభంలో ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే, శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఉపయోగించే పరికరాల కోసం ఈ ఖర్చు అవుతుంది. అలాగే, కొన్ని ప్లాన్లలో డేటా పరిమితులు ఉండే అవకాశం ఉంది.
ఇది ఫైబర్ కనెక్షన్ అందుబాటులో లేని మారుమూల గ్రామాలకు మంచి ప్రత్యామ్నాయం. అలాగే, స్మార్ట్ వ్యవసాయం, వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, డ్రోన్ ఆధారిత వ్యవసాయ సేవ కోసం కూడా బాగా ఉపయోగపడుతుంది.
గనులు, చమురు క్షేత్రాలు, నిర్మాణ ప్రాజెక్టులు వంటి దూర ప్రాంతాల్లో పనిచేసే సంస్థలకు ఇది ఎంతో ఉపయోగకరమైన సేవగా ఉంటుంది. అంతేకాదు, క్యాంపింగ్, అడ్వెంచర్ ట్రావెల్ మరియు దూర ప్రాంతాల ప్రయాణాల్లో ఇది స్థిరమైన కనెక్టివిటీ కోసం సరైన ఆప్షన్ అవుతుంది. అన్నింటి కన్నా ముఖ్యంగా సముద్రం మధ్యలో లేదా గగనతలంలో కమ్యూనికేషన్ కొనసాగించేందుకు శాటిలైట్ ఇంటర్నెట్ కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read : Exclusive: మార్కెట్ మందగించడంతో ప్రపంచవ్యాప్తంగా 12 మార్కెట్ల నుంచి వైదొలగే ఆలోచనలో Nothing
భారతదేశంలో డిజిటల్ కనెక్టివిటీని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వం, టెలికాం సంస్థలు, అంతరిక్ష రంగ సంస్థలు శాటిలైట్ ఆధారిత సేవలపై దృష్టి పెడుతున్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఈ సేవలు మరింత విస్తరించే అవకాశం ఉంది. అయితే, సర్వీస్ ప్రారంభించేందుకు అవసరమైన స్పెక్ట్రమ్ కేటాయింపులు, నియంత్రణ అనుమతులు మరియు మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి.
శాటిలైట్ ఇంటర్నెట్ అనేది కేవలం ఇంటర్నెట్ సేవ మాత్రమే కాదు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా సమర్ధవంతమైన కనెక్టివిటీని అందించే సాంకేతిక విప్లవం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలు, పరిశ్రమలు, విద్యార్థులు, అత్యవసర సేవలకు ఇది కొత్త అవకాశాలను తెరుస్తోంది.