UPI Payment తో తెలుగు రాష్ట్రాల్లో మారిన పేమెంట్ విధానం.!

HIGHLIGHTS

ఒకప్పుడు కిరాణా దుకాణంలో సరుకులు తీసుకున్న తర్వాత జేబులో భద్రంగా దాచుకున్న నోట్లను లెక్కించి ఇచ్చేవాళ్ళం

ఛార్జీ ఇవ్వడానికి చిల్లర కోసం వెతకడం ఒక పెద్ద యుద్ధం గా ఉండేది

UPI Payment అందుబాటులోకి వచ్చిన తర్వాత పేమెంట్ వ్యవస్థలో వచ్చిన మార్పు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా స్పష్టంగా కనిపిస్తుంది

ఒకప్పుడు కిరాణా దుకాణంలో సరుకులు తీసుకున్న తర్వాత జేబులో భద్రంగా దాచుకున్న నోట్లను లెక్కించి ఇచ్చేవాళ్ళం. ఇక బస్సు ఛార్జీ ఇవ్వడానికి చిల్లర కోసం వెతకడం ఒక పెద్ద యుద్ధం గా ఉండేది. కరెంట్‌ బిల్లు, ఫోన్‌ బిల్లు, స్కూల్ ఫీజులు చెల్లించాలంటే బ్యాంక్ క్యాష్ కౌంటర్‌ ముందు వరుసలో నిలబడటం సర్వ సాధారణమైన విషయం. అయితే, 2016 నుంచి [పేమెంట్ కథ పూర్తిగా మారిపోయింది. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) అందుబాటులోకి వచ్చిన తర్వాత భారతదేశ పేమెంట్ వ్యవస్థలో వచ్చిన మార్పు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

UPI Payment తెలుగు రాష్ట్రాల్లో గణాంకాలు

నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) గణాంకాల ప్రకారం, 2025 ఆగస్టులో తెలంగాణలో UPI ద్వారా సుమారు 803.98 మిలియన్‌ లావాదేవీలు, రూ.1.22 లక్షల కోట్లకు పైగా విలువైన లావాదేవీలు జరిగాయి. అదే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 551.48 మిలియన్‌ లావాదేవీలు, రూ.92,181 కోట్లకు పైగా విలువ నమోదైంది.

ఇది కేవలం పెద్ద నగరాల కథ మాత్రమే కాదు సుమా, చెల్లింపు పద్ధతిలో జరిగిన ఈ మార్పు చిన్న వ్యాపారాలు, స్ట్రీట్ వ్యాపారం, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులతో పాటు ప్రతి కుటుంబంలో నిత్యకృత్యం గా మారింది.

చిల్లర ఉందా నుంచి QR ఉందా వరకు

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌, తిరుపతి వంటి నగరాల్లో మాత్రమే ఈ మార్పు జరగలేదు. పట్టణాలతో పాటు గ్రామాల్లోని చిన్న దుకాణాల వద్ద కూడా QR Code లు సాధారణ దృశ్యం గా మారాయి. టీ దుకాణంలో పది రూపాయలు చెల్లించడానికి, కూరగాయల బండి పై చిన్న పేమెంట్స్, ఆటోకు రూ.150, టిఫిన్‌ సెంటర్‌ లో రూ.120, ఇలా చిన్న మొత్తాలకూ కూడా ఈ డిజిటల్‌ చెల్లింపు సాధ్యమైంది. గతంలో నగదు లావాదేవీకి అవసరమైన చిల్లర మరియు నోట్ల మార్పిడి వంటి చిన్న చిన్న ఇబ్బందులు UPI గణనీయంగా తగ్గించింది.

NPCI గణాంకాలు కూడా UPI వినియోగం భారీ స్థాయికి చేరిన విషయాన్ని చూపుతున్నాయి. దేశవ్యాప్తంగా 2026 ఆగస్టులో UPI ద్వారా 24,508.96 మిలియన్‌ లావాదేవీలు జరిగాయి. ఇక వాటి విలువ చూస్తే, ఏకంగా రూ.29.82 లక్షల కోట్లకు పైగా ఉంది.

హైదరాబాద్‌ నుంచి మారుమూల గ్రామం వరకు

తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్‌ చెల్లింపుల విస్తరణకు స్మార్ట్‌ ఫోన్‌ మరియు ఇంటర్నెట్‌ అందుబాటు ఒక కారణమైతే, బ్యాంకింగ్‌ సేవల విస్తరణ మరో కీలక కారణం అని చెప్పొచ్చు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు ఖాతాలు, మొబైల్‌ ఫోన్లు, ఆధార్‌ ఆధారిత సేవలు, డిజిటల్‌ చెల్లింపులు ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యాయి. UPI తో పాటు ఆధార్‌ ఆధారిత చెల్లింపు వ్యవస్థలు, బిజినెస్‌ కరస్పాండెంట్లు వంటి మార్గాలు కూడా నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి డిజిటల్‌ వ్యవస్థ వైపు మార్పుకు దోహదపడ్డాయి.

అయితే, ఈ మార్పు అన్ని కేటగిరీలలో ఒకే వేగంతో జరగలేదు. RBI నిర్వహించిన వినియోగదారుల డిజిటల్‌ చెల్లింపుల అవగాహన సర్వేలో ఆంధ్రప్రదేశ్‌ లో 73.5 శాతం, తెలంగాణలో 70.5 శాతం అవగాహన నమోదైంది. జాతీయ స్థాయిలో నమోదైన 77.2 శాతం తో పోలిస్తే ఇంకా అవగాహన పెంచాల్సిన అవకాశం ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

Also Read: iPhone 17 ఇప్పుడు లక్ష కాదు కేవలం 70 వేల ధరలో లభిస్తుంది .. ఎక్కడంటే.!

వ్యాపారంలో మారిన లెక్క

UPI కి ముందు చిన్న వ్యాపారం చేసే వ్యాపారులు రోజువారీ విక్రయాల్లో నగదు మీద ఎక్కువగా ఆధారపడేవాడు. అయితే, ఇప్పుడు నడిసున్న డిజిటల్ పేమెంట్ తో జస్ట్ మొబైల్‌ లో నోటిఫికేషన్‌ తో పేమెంట్ కన్ఫర్మ్ చేసుకోవడం అయ్యింది.

ఇప్పుడు వ్యాపారంలో కొన్ని కొత్త మార్పులు వచ్చాయి:

  • చిల్లర నోట్ల అవసరం తగ్గింది.
  • కస్టమర్‌ వద్ద నగదు లేకపోయినా అమ్మకాలకు డోకా లేదు.
  • చిన్న మొత్తాల లావాదేవీలు కూడా డిజిటల్‌ గా నమోదవుతున్నాయి.
  • రోజువారీ ఆదాయాన్ని పేమెంట్ హిస్టరీ ద్వారా పరిశీలించే అవకాశం పెరిగింది.
  • ఆన్‌లైన్‌ చెల్లింపులతో వినియోగదారుడి ఆప్షన్ మరింతగా విస్తరించాయి.

ఇక పెద్ద వ్యాపారాలకే పరిమితమైన డిజిటల్‌ చెల్లింపులు, ఇప్పుడు చిన్న వ్యాపారాల సాధారణ పద్ధతిగా మారడం ఈ పరిణామంలో ముఖ్యమైన అంశం.

నగదు పూర్తిగా కనుమరుగైందా?

ఈ ప్రశ్నకు క్లియర్ కట్ సమాధానం లేదు అని చెబుతాము. తెలుగు రాష్ట్రాల్లోనూ నగదు ఇంకా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగమే. ముఖ్యంగా ఇంటర్నెట్‌ సమస్యలు, స్మార్ట్‌ ఫోన్‌ లేదా డిజిటల్‌ పరిజ్ఞానం లేని వినియోగదారులు, కొన్ని చిన్న లావాదేవీలు వంటి సందర్భాల్లో నగదుకు ప్రాధాన్యత ఇప్పటికీ కొనసాగుతోంది.

UPI రాకతో చెల్లింపు ఒక ప్రత్యేక ప్రక్రియ కాదు, ఇది రోజువారీ జీవితంలో కలిసిపోయిన ఒక డిజిటల్‌ అలవాటు అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఆ మార్పు ఇప్పటికే మన కళ్ల ముందే జరుగుతోంది. ఇది మరింత విస్తరించే అవకాశం ఉంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :