AI తో ఉద్యోగాలు పోతాయా .. హైదరాబాద్ యువత తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలివే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది
AI వల్ల ఉద్యోగాలు తగ్గుతాయనే ప్రశ్న తీవ్రంగా పెరుగుతోంది
ఎంట్రీ లెవల్ ఉద్యోగాల నియామకాల్లో మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది మరియు ఇప్పుడు ఇది ఒక ప్రపంచ శక్తిగా మారుతోంది. ఒకప్పుడు గంటల సమయం పట్టే పనులు కూడా ఇప్పుడు కేవలం నిమిషాల్లోనే పూర్తి చేయడానికి AI టూల్స్ సహాయం చేస్తున్నాయి. దీంతో సాఫ్ట్ వేర్, కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ మరియు కంటెంట్ రైటింగ్ వంటి రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొత్త ఆందోళన మొదలైంది. ముఖ్యంగా, ఐటీ కంపెనీలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్ యువతలో AI వల్ల ఉద్యోగాలు తగ్గుతాయా? అనే ప్రశ్న తీవ్రంగా పెరుగుతోంది.
AI తో ఉద్యోగాలు పోతాయా?
ఇటీవల వెలువడిన Randstad నివేదిక ప్రకారం, భారతదేశంలో దాదాపు 90 శాతం మంది ఎంప్లాయర్లు AI అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ టెక్నాలజీ టీమ్ లను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో 63 శాతం కంపెనీలలో వచ్చే 12–24 నెలల్లో టెక్నాలజీ ఉద్యోగుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా, సాధారణ పనులు చేసే ఎంట్రీ లెవల్ ఉద్యోగాల నియామకాల్లో మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ యువతకు కొత్త అవకాశాలు
తెలంగాణ ప్రభుత్వ పెట్టుబడి ప్రోత్సాహక విభాగం వివరాల ప్రకారం హైదరాబాద్ లో 500 కు పైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCCs), 9.39 లక్షలకు పైగా ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులు ఉన్నారు. AI, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ మరియు డేటా అనలిటిక్స్ వంటి విభాగాల్లో కొత్త నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో AI టెక్నాలజీ తెలిసిన అభ్యర్థులకు కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇది కేవలం హైదరాబాద్ లో ఉన్న యువతకు మాత్రమే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు యువతకు వరంగా మారే అవకాశం ఉంటుంది.
యువత ఇప్పుడు ఏం నేర్చుకోవాలి?
ChatGPT మరియు Gemini వంటి AI టూల్స్ ను సమర్థంగా ఉపయోగించడం నేర్చుకోవాలి. అంతేకాదు, Python, డేటా అనలిటిక్స్, క్లౌడ్ టెక్నాలజీ మరియు సైబర్ సెక్యూరిటీ వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. కేవలం డిగ్రీ పై మాత్రమే ఆధారపడకుండా ప్రాక్టికల్ ప్రాజెక్టులు, కమ్యూనికేషన్ మరియు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పై యువత ఎక్కువగా దృష్టి పెట్టాలి.
AI అన్ని ఉద్యోగాలు తొలగిస్తుందని కచ్చితంగా చెప్పలేం. అయితే, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నూతన టెక్ నేర్చుకోవడం మరియు వాటితో నైపుణ్యాలను పెంచుకోవడం చేయాలి. అలాంటి వారికి ఏఐ లేదా ఇతర సమస్యలు అంత కఠినంగా మారే అవకాశం ఉండదు. ఈ కొత్త పరిణామం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, పారే నీటిలో మనం కూడా సాగిపోవాలి. కొత్త టెక్ మరియు కొత్తగా విషయాలతో ఎప్పటి కప్పుడు మనం కూడా అప్డేట్ గా ఉండాలి.