how to check or verify Fake Medicines with smartphone
కల్తీ సమస్య అనేది కేవలం మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి పెద్ద సమస్య గా పరిగణిస్తారు. అందులోను మనిషికి ప్రాణం పోసే మెడిసిన్ లలో కల్తీ జరగడం అనేది అతిపెద్ద సమస్య అవుతుంది. దేశంలో నకిలీ మందులు (Fake Medicines) ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. అయితే, మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ సాయంతోనే మీరు తీసుకున్న మెడిసిన్ ఒరిజినల్ అవునా కాదా అనేది చాలా వరకు తెలుసుకునే అవకాశం ఉంది. ఇలా చేయడానికి తగిన విధానాలు మరియు ప్రస్తుతం భారత దేశంలో అమలులో ఉన్న నమ్మదగిన పద్ధతులు ఈరోజు చూద్దాం.
ఏదైనా మెడిసిన్ ను చెక్ చేయడానికి, మందుల ప్యాకెట్ పై ఉన్న QR కోడ్ లేదా బార్ కోడ్ మొదటి సూచనగా ఉపయోగపడుతుంది. ప్రముఖ ఔషధ కంపెనీలు అన్ని కూడా వారి మెడిసిన్ ప్యాకెట్ పై QR కోడ్ ను ఆఫర్ చేస్తున్నాయి. మీరు మీ ఫోన్ లోని కెమెరా లేదా ఏదైనా నమ్మదగిన QR స్కానర్ యాప్ తో ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు ఆ మందుకు సంబంధించిన తయారీదారు పేరు, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీ వంటి పూర్తి వివరాలు ఫోన్ పై కనిపిస్తాయి. ఒకవేళ స్కాన్ చేసేటప్పుడు ఆ స్కానర్ ద్వారా ఎటువంటి సమాచారం చూపించకయినా లేక అనుమానాస్పద వెబ్ సైట్ ఓపెన్ అయితే, ఈ మందులు గురించి మీరు జాగ్రత్త పడటం మంచిది.
కొన్ని కంపెనీలు యూనిక్ కోడ్ ఆధారిత వెరిఫికేషన్ సిస్టమ్ కూడా ఉపయోగిస్తున్నాయి. మెడిసిన్ ప్యాక్ పై ఉన్న కోడ్‌ను నిర్దిష్ట నంబర్‌కు SMS చేయడం లేదా కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో ఎంటర్ చేయడం ద్వారా అది జెన్యూన్ మెడిసిన్ అవునా కాదా అనే విషయం మీరు నిర్ధారించవచ్చు. ఖరీదైన లేదా అధికంగా నకిలీ అయ్యే మందుల విషయంలో ఈ విధానం ముఖ్యంగా ఉపయోగిస్తున్నారు.
అలాగే, మందుల పై ఉన్న బ్యాచ్ నెంబర్ మరియు లైసెన్స్ వివరాలు కూడా చాలా కీలకంగా ఉంటాయి. బ్యాచ్ నంబర్ ను మీరు సంబంధిత మెడిసిన్ తయారీ కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో లేదా కంపెనీ కస్టమర్ కేర్ ద్వారా చెక్ చేయవచ్చు. నిజమైన మందులైతే ఈ వివరాలు స్పష్టంగా నమోదు అయి ఉంటాయి.
భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఔషధ నియంత్రణ సంస్థలు (Drug Regulatory Authorities) అందించే సమాచారం కూడా మంచి సహాయం చేస్తుంది. కొన్ని ప్రభుత్వ పోర్టల్స్‌లో అనుమతించబడిన మందుల వివరాలు లభిస్తాయి. మీ స్మార్ట్ ఫోన్ బ్రౌజర్ ద్వారా ఈ వివరాలను పోల్చి చూడవచ్చు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అమ్ముడయ్యే మందుల ప్యాకింగ్ పైన కూడా తప్పనిసరిగా కొన్ని ముద్రణలు, హెచ్చరికలు ఉండాలి. ఒకవేళ ఇది లేదంటే అది అనుమానాస్పదంగా భావించాల్సిన విషయం అవుతుంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్యాకింగ్ నాణ్యత, అస్పష్టమైన ప్రింటింగ్, స్పెల్లింగ్ మిస్టేక్స్ మరియు సీల్ దెబ్బతినడం వంటి లక్షణాలు ఉంటే కూడా అది నకిలీ మెడిసిన్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఈ విషయాలను కూడా మీ ఫోన్ కెమెరాతో జూమ్ చేసి సులభంగా పరిశీలించవచ్చు. స్మార్ట్‌ఫోన్ అనేది కేవలం కాల్ చేయడానికి లేదా సోషల్ మీడియాకు మాత్రమే కాదు మీ ఆరోగ్యాన్ని కాపాడే ఒక కీలక సాధనంగా కూడా ఉపయోగపడుతుంది.