ఇటీవల, Youtube తన ప్లాట్ఫామ్ పైన స్ట్రీమింగ్ నాణ్యతను 480p లేదా స్టాండర్డ్ డెఫినిషన్ (SD) కు పరిమితం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి వలన ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండటానికి మరియు ఇంటి నుండి కూడా పని చేయడానికి దారితీయడంతో, బ్యాండ్‌విడ్త్ లభ్యత పై ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంలో బాగంగా ఇలా చెయ్యాలిసివచ్చింది. అయితే, ఇప్పుడు భారతదేశంలో 1080p HD వీడియో స్ట్రీమింగ్ పై యూట్యూబ్ తన మొబైల్ పరిమితులను ఎత్తివేసింది.
అందరూ ఒక్కసారిగా తమ పనుల కోసం ఆన్లైన్ పైన ఆధారాపడాల్సిరావడం, ఫలితంగా హోమ్ ఇంటర్నెట్ మరియు బ్రాడ్ బ్యాండ్ వాడకం పెరిగింది. రోజంతా యూట్యూబ్ వీడియోలను చూసే వారి సంఖ్యలో పెద్ద ఎత్తున మార్పులను గూగుల్ గమనించింది. అందువల్ల, సర్వర్లు మరియు సిస్టమ్ యొక్క అంతరాయాన్ని నివారించడానికి స్ట్రీమింగ్ నాణ్యతను తగ్గించాలని నిర్ణయించింది.
ఈ మార్పును ప్రకటించిన నాలుగు నెలల తరువాత, గూగుల్ ఇప్పుడు Wi-Fi ద్వారా Youtube ని వినియోగించే వినియోగదారులను HD 720p, పూర్తి HD 1080p మరియు మరిన్ని రిజల్యూషన్లలో యూట్యూబ్ వీడియోలను ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది. అయితే, మీరు కేవలం Wi-Fi నెట్ వర్క్ ను ఉపయోగిస్తే మాత్రేమ్ యూట్యూబ్‌లో HD మరియు అంతకంటే ఎక్కువ నాణ్యత గల వీడియోలను చూడగలరు. లేకపోతే, YouTube యాప్ అన్ని వీడియోలను 480p నాణ్యతకు డిఫాల్ట్ చేస్తుంది.
1080p HD వీడియో స్ట్రీమింగ్‌పై YouTube రిస్ట్రిక్షన్స్ ఎత్తివేసింది
ఆసక్తికరంగా, ఈ లాక్డౌన్ సమయంలో మొబైల్ వినియోగదారులకు మాత్రమే ఈ ఆంక్షలు అమలులో ఉన్నాయి. మేము, PC లలో ఎటువంటి సమస్యలు లేకుండా 4K UHD లో యూట్యూబ్ వీడియోను చూడగలిగాము. ఇంతకు ముందు, మీరు మీ ఇంటి Wi-Fi నెట్ వర్క్‌కు కనెక్ట్ అయినప్పటికీ, మీ మొబైల్ 480p కంటే ఎక్కువ నాణ్యతతో YouTube కంటెంట్‌ను ప్రసారం చేయదు. వాస్తవానికి, మీరు YouTube యాప్ ని వదిలేసి, దానికి బదులుగా మీ ఫోన్ లో బ్రౌజర్ ద్వారా యూట్యూబ్ ఉపయోగిస్తే, మీరు 720p వద్ద కొంచెం అధిక నాణ్యత గల స్ట్రీమ్ ను పొందవచ్చు.
నెట్ వర్క్ కనెక్టివిటీ పై కలుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికి టెలికాం ఆపరేటర్లు నెట్ ఫ్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్ లను తమ ప్లాట్ ఫామ్‌లపై స్ట్రీమింగ్ నాణ్యతను తగ్గించాలని కోరినందున, అన్ని ప్లాట్ఫామ్స్ కూడా వారి స్ట్రీమింగ్ నాణ్యతను డీఫాల్ట్ రిజల్యూషన్ కి పరిమితం చెయ్యాల్సి వచ్చింది, వాటిలో యూట్యూబ్ కూడా ఒకటి. అనేక నివేదికల ప్రకారం, కరోనావైరస్ వ్యాప్తి మరియు లాక్డౌన్ వలన ఆన్ లైన్ యాక్టివిటీ మరియు ఆన్ లైన్ స్ట్రీమింగ్ 20 శాతానికి పైగా పెరిగింది.