మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2022 కార్యక్రమం ఈరోజు నుండి మొదలయ్యింది. ఈ అతిపెద్ద టెక్ వేదిక ద్వారా అన్ని బ్రాండ్స్ కూడా తమ నూతన ఆవిష్కారాలను ప్రదర్శిస్తాయి. ఈ కార్యక్రమం మొదటిరోజైన ఈ రోజు OPPO తన నూతన ఆవిష్కారాన్ని ప్రదర్శించింది. MWC 2022లో ఛార్జింగ్ టెక్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఒప్పో రెండు కొత్త ఛార్జింగ్ ప్రమాణాలను తీసుకొచ్చింది. వీటిలో ఒకటి 150W SuperVOOC ఛార్జింగ్ టెక్ కాగా రెండవది 240W SuperVOOC ఛార్జింగ్ టెక్. అంతేకాదు, ఇంత వేగంతో ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ బ్యాటరీకి హాని కలుగకుండా చూసేలా బ్యాటరీ హెల్త్ ఇంజిన్ (BHE)తో ఈ కొత్త ఛార్జింగ్ టెక్ ను తీసుకొచ్చింది.
ఈ 150W SuperVOOC అడాప్టర్ గాలియం నైట్రైడ్ (GaN)తో తయారు చేయబడింది. ఇది దాదాపు 172g బరువును కలిగి ఉంటుంది. మరియు ఇది కేవలం 15 నిమిషాల్లోనే 4500mAh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది. ఈ 150W SuperVOOC ఇంటిగ్రేటెడ్/కస్టమైజ్డ్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ చిప్‌తో వస్తుంది. అంటే, సింపుల్ గా చెప్పాలంటే, ఇది స్మార్ట్ బ్యాటరీ హెల్త్ అల్గారిథమ్ మరియు బ్యాటరీ హీలింగ్ టెక్నాలజీ పై ఆధారపడి పనిచేస్తుంది.
ఈ టెక్ మిడ్ రేంజ్ నుండి మొదలుకొని హై-ఎండ్ వరకూ ఒప్పో మరియు వన్‌ప్లస్ ఫోన్‌లకు ఈ ఛార్జర్ టెక్ చేర్చబడుతుంది. ఈ టెక్నాలజీని కలిగి ఉన్న మొదటి OnePlus ఫోన్ Q2, 2022లో ప్రారంభించబడుతుంది.
ఇక భారీ ఛార్జింగ్ టెక్ ఆవిష్కారం విషయానికి వస్తే, Oppo ప్రకారం ఈ 240W SuperVOOC చార్జర్ కేవలం 9 నిమిషాల్లోనే 4500mAh బ్యాటరీని సున్నా నుండి 100% వరకు రీఫిల్ చేయగలదు. ఇది 24V/10A USB-C కనెక్షన్‌తో చేయబడుతుంది. అయితే, ఇంత వేగంతో ఛార్జ్ చేసేప్పుడు బ్యాటరీకి ఎటువంటి నష్టం వాటిళ్లకుండా ఒప్పో తీసుకున్న జాగ్రత్తల గురించి కూడా వివరించింది.
కస్టమ్-మేడ్ ఇంటెలిజెంట్ కంట్రోల్ చిప్: ఇది వోల్టేజ్, కరెంట్ మరియు ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది మరియు బాహ్య శక్తి కారణంగా ఛార్జర్ దెబ్బతిన్నట్లయితే విశ్లేషిస్తుంది. అంతేకాదు, ఈ అడాప్టర్‌కు మద్దతు ఇచ్చే Oppo ఫోన్‌లు అన్ని కూడా 13 ఉష్ణోగ్రత సెన్సార్‌లతో వస్తాయని క్లారిటీ ఇచ్చింది.