ఇ-కామర్స్ వెబ్సైట్స్ నుండి ఆర్డర్ చేసిన వస్తువులు తప్పుగా రావడం గురించి మనం చాలాసార్లు విన్నాం. ఇటీవల కూడా గత నెలలో కేరళలోని అలువాకు చెందిన ఒక వ్యక్తి iPhone 12 ని అమెజాన్ నుండి ఆర్డర్ చేస్తే ఒక డిష్ వాష్ బార్ మరియు ఒక 5 రూపాయల కాయిన్ అందుకున్నాడు. ఇప్పుడు మరింత ఆశ్చర్యకరంగా కేరళకు చెందిన మరో వ్యక్తికి ఇలాంటి సంఘటనే ఎదురయ్యింది. అయితే, ఇతను పాస్‌పోర్ట్ కవర్‌ను ఆర్డర్ చేస్తే ఏకంగా పాస్‌పోర్ట్ ను అందుకున్నాడు. పాస్‌పోర్ట్ కవర్‌ను ఆర్డర్ చేస్తే పాస్‌పోర్ట్ ను ఎలా డెలివరీ చేశారు? అసలు ఆ పాస్‌పోర్ట్ ఎవరిది? దీనికి కారణాలు ఏమిటి? అని విన్న ప్రతిఒక్కరికి వచ్చిన డౌట్? అవునా..! మరి అసలు కథేమిటో తెలుసుకుందాం.
2021 అక్టోబర్ 30న కేరళకు చెందిన మిథున్ అనే వ్యక్తి అమెజాన్ నుండి పాస్‌పోర్ట్ కవర్ కోసం ఆర్డర్ చేశాడు. నవంబర్ 1 న మిథున్ తాను చేసిన ఆర్డర్ డెలివరి అందుకున్నాడు. ప్రోడక్ట్ ను చెక్ చేస్తే ఆర్డర్ చేసిన పాస్‌పోర్ట్ కవర్ తో పాటుగా ఏకంగా పాస్‌పోర్ట్ ను కూడా ఇచ్చినట్లు అర్ధమయ్యింది. అయితే, ఆ పాస్‌పోర్ట్ అతనిది మాత్రం కాదు కానీ, అది ఒక ఒరిజినల్ పాస్‌పోర్ట్.
ఈ అనుకోని సంఘటన నుండి తేరుకున్న కస్టమర్ వెంటనే అమెజాన్ కస్టమర్ కేర్ ను సంప్రదించాడు. అయితే, కస్టమర్ కేర్ సమాధానం మిథున్ ను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే, 'మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము, మరొకసారి ఇటివంటి తప్పు జరుగకుండా చేసుకుంటాము' అని సమాధానం చెప్పారు. కానీ, ఆ ఒరిజినల్ పాస్‌పోర్ట్ ను ఏమిచెయ్యాలో మాత్రం చెప్పలేదు.
మిథున్, ఆ ఒరిజినల్ పాస్‌పోర్ట్ ను ఒరిజినల్ ఓనర్ వద్దకు చేర్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే, ఆ పాస్‌పోర్ట్ లో మొబైల్ నంబర్ లేకపోవడంతో పాస్‌పోర్ట్ లో అందించిన వారి అడ్రస్ ను చేరుకొని అందించారు.
ముందుగా అందిరిలో కలిగిన మొట్టమొదటి ప్రశ్నలు బహుశా ఇవేకావచ్చు. అసలు విషయం ఏమిటంటే, మిథున్ అందుకున్న పాస్‌పోర్ట్ కవర్, మొదటిగా మొహమ్మద్ సలీహ్ అనే వ్యక్తి ఆర్డర్ చేసారు. ఆ పాస్‌పోర్ట్ కవర్ ను అందుకున్న తరువాత చెక్ చెయ్యడానికి తన ఒరిజల్ పాస్‌పోర్ట్ ను ఉపయోగించారు. అయితే, నచ్చక పోవడంతో ఆ ఆర్డర్ ను రిటర్న్ చేశారు. కానీ, రిటర్న్ చేసే సమయంలో తన ఒరిజినల్ పాస్‌పోర్ట్ ను ఆ కవర్ లో నుండి తియ్యడం మర్చిపోయారు.
తరువాత, తిరిగి వచ్చిన ప్రోడక్ట్ ను సరిగ్గా పరిశీలించకుండా ఇదే పాస్‌పోర్ట్ కవర్ ను ఆర్డర్ చేసిన మరొక కస్టమర్, అంటే మిథున్ కి అమ్మడంతో ఈ విధంగా జరిగింది.